వ్యాయామానికి సంబందించిన ఆకస్మిక గుండె మరణాలను నిరోధించడం ఎలా?

Posted on: 22 Mar 2022

వ్యాయామానికి సంబందించిన ఆకస్మిక గుండె మరణాలను నిరోధించడం ఎలా?

ఆకస్మిక గుండెపోటు అనేది ఎన్నో సంవత్సరాలుగా ఆధునిక వైద్య పద్ధతుల్లో వచ్చిన పురోగతులు సైతం మరణాలను తగ్గించలేని ఒక పరిస్థితి. ఆకస్మిక గుండెపోటుకు చాలా కారణాలు ఉన్నప్పటికీ, క్రమరహిత హృదయ స్పందన( హార్ట్ బీట్ ) అనేది అతి సాధారణ కారణంగా కనబడుతుంది. దీని వల్ల, గుండె నుండి పూర్తి శరీరానికి పంపిణి చేయబడే రక్తం ఆగిపోతుంది.

ఆరోగ్యం మరియు శారీరక కార్యాచరణలు

రోజువారీ చేసే శారీరక వ్యాయామాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో గుండెపోటుతో పాటు ఇతర జబ్బులను తగ్గించవచ్చు. చాలా శాస్త్రీయ ఆధారాలతో నిరూపితమైన విషయం ఏమిటంటే, ప్రతిరోజూ వ్యాయామం చేసే వారిలో త్వరగా మరణించే ప్రమాదం 20-30% వరకు తగ్గుతుంది. అలాగే వారికి డయాబెటీస్, హై బీపీ, హార్ట్ఏటాక్, బ్రెయిన్ స్ట్రోక్, కోలోరెక్టల్ కాన్సర్, బ్రెస్ట్ కాన్సర్, ఎముకల బలహీనత వంటి జబ్బులు కూడా తక్కువగా సోకే అవకాశం ఉంది. రోజు వ్యాయామం చేయడం వల్ల శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది.

పద్దతి ప్రకారం, ప్రతిరోజూ చేసే వ్యాయామం గుండెపోటును ఎలా అయితే నివారిస్తుందో, ఒక్కసారిగా చేసే ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామం అనేది గుండెపోటుకు, తద్వారా ఆకస్మిక మరణానికి కూడా కారణం కాగలదు.

30 సంవత్సరాల కన్నా తక్కువ వయసు వారిలో ఉండే సాధారణ కారణాలు :

1. పుట్టుకతోనే ఉన్నప్పటికి గుర్తించబడని గుండె జబ్బులు
2. గుండె కవాటం సమస్యలు
3. గుండె కండరాల జబ్బులు
4. గుండెలోని విద్యుత్ వ్యవస్థ సమస్యలు
5. ప్రధాన రక్తనాళాలు పలుచబడి, చీలికకు గురి కావడం.

30 -40 సంవత్సరాల వయసు వారిలో ఉండే సాధారణ కారణాలు :

1. ముందుగానే ఉన్న చిన్న చీలిక వల్ల రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోవడం- ఇది సర్వ సాధారణ కారణం.
2. గుండె మీద ఒత్తిడి కారణంగా హార్ట్ రేట్ మరియు బీపీ ఒక్కసారిగా అధికంగా పెరిగి, గుండె రక్తనాళాలు మూసుకుపోవడం.
3. ఊపిరితిత్తుల రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడటం.
4. గతంలో వచ్చిన గుండెపోటు కారణంగా గుండెలో మచ్చ ఏర్పడటం.

బలమైన లేదా శ్రమతో కూడిన వ్యాయామం అంటే ఏమిటి?

ఈ రకమైన వ్యాయామంలో ఊపిరి తీసుకోకుండా కనీసం కొన్ని పదాలు కూడా మాట్లాడలేము. ఉదాహరణకు: పరిగెత్తడం, తాడాట, ఎరోబిక్ డాన్స్, గంటకి 10 మైళ్ళ కన్నా ఎక్కువ వేగంతో సైక్లింగ్, ఎత్తయిన కొండ పైకి ఎక్కడం, మొదలైనవి.

అటువంటి వ్యాయామాల వల్ల ఏం జరుగుతుంది?

ఈ బలమైన వ్యాయామలు అనేవి 10% కన్నా ఎక్కువ పరిస్థితుల్లో గుండెపోటుకి ముందస్తు కారణంగా ఉన్నాయి.
అటువంటి వ్యాయామాల వల్ల శరీరంలో అడ్రెనాలిన్ అనే పదార్థం విడుదల అయి, హార్ట్ రేట్, బీపీ మరియు రక్తంలో ఫాటీ ఆసిడ్స్ ను పెంచుతుంది. హృదయ కండరాల సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో ఈ రకమైన వ్యాయామలు అనేవి కండరాల పోటుకు కారణమై, తద్వారా ఆకస్మిక మరణానికి దారి తీయవచ్చు.

వ్యాయామం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి?

1. సరైన శిక్షకుడి ఆధ్వర్యంలో మాత్రమే ప్రాథమిక వ్యాయామం తర్వాత ఒక మోస్తరు వ్యాయామనికి మారాలి.
2. గుండె సమస్యలు ఉన్నవారు వ్యాయామం మొదలుపెట్టే ముందుగా వారి కార్డియాలజిస్ట్ (హృద్రోగ నిపుణులు) ను సంప్రదించి, మరింత సరైన పద్దతిలో జాగ్రత్తగా చేయాలి.
3. అత్యధిక వేడి లేదా చల్లని వాతావరణంలో వ్యాయామం చేయడం వల్ల హార్ట్ఎటాక్, మరణాల ప్రమాదం పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి అటువంటివి నివారించాలి.
శిక్షణ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
1. శిక్షకుడు ప్రాధమిక శిక్షణ పొంది ఉండాలి.
2. కేంద్రంలో ఆటోమేటడ్ డీఫిబ్రిలేటర్ సౌకర్యం ఉండాలి.
3. దగ్గరలోని ఆసుపత్రికి రవాణా సౌకర్యం ఉండాలి.

గుండెను కాపాడుకోవడానికి ఎంతవరకు వ్యాయామం సరిపోతుంది?

మార్గదర్శకాలు అనేవి చాలా స్పష్టంగా ఉన్నాయి. కేవలం 30 నిమిషాల తేలికపాటి వ్యాయామం లేదా 15 నిముషాల శక్తివంతమైన వ్యాయామం వారానికి కనీసం 5 రోజులపాటు చేయడం వల్ల మీ గుండెతో పాటు ఇతర సమస్యల నుండి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. కాబట్టి, ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు ఎక్కువసేపు చేయడం అనేది ఆమోదించదగినది కాదు.

వ్యాయమ సంబంధిత ఆకస్మిక గుండెపోటును నివారించడం ఎలా?

వ్యాయమ సంబంధిత ఆకస్మిక గుండెపోటును మనం పూర్తిగా నివారించలేకపోయినప్పటికి, కొన్ని విధానాలు అనుసరించడం ద్వారా ఆ ముప్పుని కొంతమేరకు తగ్గించవచ్చు. ఎక్కువగా యువకుల్లో ముందే గుండెకు సంబందించిన సమస్యలు ఉన్నవారు ఈ విధమైన గుండెపోటుకు గురి కావడానికి అవకాశం ఉంది కాబట్టి, సరైన నిర్ధారణ చేసి ముందుగానే కనుగొనవచ్చు. అయితే బలమైన వ్యాయామలను చేసే ముందు

1) పుట్టుకతో వచ్చిన గుండె సమస్యలు ఏమైనా ఉన్నాయో నిర్ధారించుకోవాలి
2) గుండెలో విద్యుత్ ఆటంకాలు ఉన్నాయేమో అని ఈసీజీ లేదా హోల్టర్ మోటార్ ఉపయోగించి తెలుసుకోవాలి.

తరచుగా ఎన్నిసార్లు గుండె సంబంధిత నిర్ధారణలు చేయడం అవసరం?

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచన మేరకు, వ్యాయామ క్రీడాల్లో పాల్గునే ముందు ఒకసారి, ఆ తర్వాత 2-4 సంవత్సరాలకు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.
ఇటలీలో గత 40 సంవత్సరాల నుండి ప్రతి క్రీడాకారుడు, డాక్టర్ వద్ద తప్పనిసరిగా నిర్ధారణ చేయించుకోవడం ద్వారా వారిలో మరణాల రేటు చాలావరకు తగ్గింది.
అలాగే మధుమేహం ఉన్నవారు మరియు 45 సంవత్సరాలు పైబడిన వారు, వ్యాయామం ప్రారంభించే ముందు తప్పనిసరిగా హృద్రోగ నిపుణున్ని సంప్రదించాలి.

కార్డియోలజిస్ట్ను ఎపుడు కలవాలి?

అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి గుండె సంబంధిత ఘటనలు ఏర్పడితే, డాక్టర్ ను ఎపుడు సంప్రదించాలో తెలుసుకోవాలి.
• ఛాతి నొప్పి లేదా ఇబ్బందిగా, బరువుగా అన్పించడం.
• అసాధారణమైన అలసట, నీరసం.
• తలతిప్పడం, స్పృహ కోల్పోవడం.
• గుండె అతి వేగంగా కొట్టుకోవడం.
• శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
• తీవ్రమైన తలనొప్పి.

ముందుగానే ఉన్న గుండె సంబంధిత సమస్యలు, కుటుంబ ఆరోగ్య చరిత్ర, దూమపానం వంటివి ప్రమాదకర జీవన విధానాల బట్టి డాక్టర్ అంచనా వేయగలరు కాబట్టి, సరైన మరియు పూర్తి వివరాలను నిజాయతీగా డాక్టర్ కు ఇవ్వాలి. ఈ విధమైన అంచనా ద్వారా ప్రమాదం తగ్గినప్పటికి, ఆకస్మిక గుండెపోటును పూర్తిగా నిరోధించవచ్చు అన్న హామీ లేదు.